రెండో దశ ఎన్నికలు : నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచే

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ మినహా మొదటి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగే 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది.

Update: 2024-03-27 12:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ మినహా మొదటి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగే 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది. బిహార్‌లో ఓ స్థానిక పండుగ ఉన్నందున మొదటి దశ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గురువారం వరకు అక్కడి అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించారు. ఇక రెండోదశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్లను స్వీకరించే ఘట్టం గురువారం నుంచి ప్రారంభం అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఇక 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేస్తామని చెప్పింది.

గడ్కరీ, కె. అన్నామలై.. 

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో రెండోదశ‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏప్రిల్ 4 వరకు ఈ రాష్ట్రాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 5న జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ 6న జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించేందుకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 8. ఇక బుధవారం రోజు నామినేషన్లు దాఖలు చేసిన కీలక అభ్యర్థుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్, తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతాయి, దేశవ్యాప్తంగా ఓటర్లు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఓట్లు వేయనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Tags:    

Similar News