కోల్ కతా వైద్యురాలి ఫోటో..వివరాలు తొలగించాలి : వికీపీడియాకు సుప్రీం ఆదేశాలు

హత్యాచారానికి బలైన కోల్ కతా ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి ఫోటో సహా ఆమె గుర్తింపు వివరాలను వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది.

Update: 2024-09-17 09:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : హత్యాచారానికి బలైన కోల్ కతా ఆర్ జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి ఫోటో సహా ఆమె గుర్తింపు వివరాలను వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది. ఆర్ జీ కర్ మెడికల్ కశాశాల ట్రైనీ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తుంది. ఈ రోజు కేసు విచారణలో భాగంగా వికీపీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి గుర్తింపును ఏ విధంగా బహిర్గతం చేయకూడదని, బాధితురాలి ఫోటో, ఆమె గుర్తింపుకు సంబంధించి ఏదైనా కంటెంట్ వెంటనే తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు వికీపీడియాను ఆదేశించింది. అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, ఇందుకు సంబంధించి భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్ లైన్ లో షేర్ చేయబడ్డాయని, ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా సీజేఐ ప్రస్తావించారు. 2018లో నిపుల్ సక్సేనా కేసులో.. ఏ వ్యక్తి కూడా బాధితురాలు లేక బాధితుడి ఫోటోలను ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో బహిర్గతం చేయకూడదని, ఇది వారి గుర్తింపుని ప్రజల్లో ప్రచారం చేసేదవుతుందని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై సీజేఐ ఆగ్రహం

కోల్ కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిప్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ను సీజేఐ తప్పుబట్టారు. మహిళా వైద్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్ జీ కర్ మెడికల్ కశాశాల ట్రైనీ వైద్యురాలి హత్య ఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. "మహిళలు రాత్రివేళల్లో పనిచేయరని మీరు ఎలా చెప్పగలరు.. రాత్రి వేళ్లలో మహిళా వైద్యులకు రాయితీ అక్కర్లేదు... అదే షిఫ్టులో పనిచేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని బెంగాల్ ప్రభుత్వం తరుపున కేసు వాదిస్తున్న కపిల్ సిబల్ ను ఉద్దేశిస్తూ ధర్మాసనం చురకలేసింది. "మిస్టర్ సిబల్  దీనికి సమాధానంగా మీరు తప్పనిసరిగా మహిళా వైద్యులకు భద్రత ఇవ్వాలని, పశ్చిమ బెంగాల్ నోటిఫికేషన్ సరిచేయాలని.. భద్రత కల్పించడం మీ విధి అని..మహిళలు రాత్రి పూట పనిచేయలేరు అని మీరు చెప్పలేరని.. పైలట్లు, ఆర్మీ మొదలైన ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారని సీజేఐ గుర్తు చేశారు. మహిళా వైద్యులు రాత్రిపూట పని చేయకపోవడం వారి కెరీర్ కు విఘాతం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.


Similar News