Jairam Ramesh: 'అది పార్లమెంట్‌ భవనం కాదు.. మోడీ మల్టీప్లెక్స్'

కొత్త పార్లమెంట్‌ భవనంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2023-09-23 11:00 GMT

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్‌ భవనంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆ బిల్డింగ్‌‌ను పార్లమెంట్‌ అనే కన్నా ‘మోడీ మల్టీప్లెక్స్‌’ లేదా ‘మోడీ మారియట్’ అని పిలవడమే కరెక్ట్ అని కామెంట్ చేశారు. పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త పార్లమెంట్‌ భవనం రూపకల్పనలో చాలా లోపాలు జరిగాయని, అది సౌకర్యవంతంగా లేదని పేర్కొన్నారు. సభల మధ్య ఎంపీలు రాకపోకలు సాగించేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందని చెప్పారు. ఈమేరకు జైరాం రమేశ్‌ శనివారం ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్‌లో కూర్చున్న సభ్యులు ఒకరినొకరు చూసుకోవడానికి బైనాక్యులర్స్‌‌ను వాడాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉందని తెలిపారు.

‘‘పాత భవనంలో ఎవరైనా తప్పిపోతే.. అది వృత్తాకారంలో ఉన్నందున సులువుగా దారిని గుర్తించొచ్చు. కానీ కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే అంతే.. వెనక్కి వచ్చేందుకు కూడా వీలులేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. పార్టీలకు అతీతంగా నా తోటి ఎంపీలంతా ఇలాగే ఫీల్ అవుతున్నారని నేను భావిస్తున్నాను’’ అని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ‘‘కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. మా వాళ్లందరి అభిప్రాయం కూడా ఇదే. 2024లో మోడీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Similar News