'స్పీడ్ బ్రేకర్లు, సూపర్ ఫాస్ట్ హైవే.. ఎలా ఉండాలో మీదే నిర్ణయం ': ఐఏఎస్‌లతో ప్రధాని మోడీ

'న్యూ ఇండియా' లోపభూయిష్ట విధానంలా ఉండకూడదని, అత్యంత క్రియాశీలత కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Update: 2024-07-11 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన పాలన, జీవన ప్రమాణాలను అందించాలని ట్రెయినీ ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'న్యూ ఇండియా' లోపభూయిష్ట విధానంలా ఉండకూడదని, అత్యంత క్రియాశీలత కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా ఉన్న ఐఏఎస్ 2022 బ్యాచ్‌కి చెందిన 181 మంది ఆఫీసర్ ట్రైనీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఐఏఎస్‌లుగా సేవలందించడంలో మీరు స్పీడ్ బ్రేకర్లుగా ఉండాలా? సూపర్ ఫాస్ట్ హైవేలుగా ఉండాలా అనేది మీరే ఎంచుకోవాలి. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి చేరవేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంతృప్త విధానం సామాజిక న్యాయాన్ని పెంపొదిస్తోందని తెలిపారు. 'లఖపతి దీదీ', 'డ్రోన్‌ దీదీ', 'పీఎం ఆవాస్‌ యోజన' వంటి పథకాల గురించి మాట్లాడుతూ.. ఈ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వారంతా సరైన దిశలో పని చేయాలన్నారు. 'నేషన్ ఫస్ట్' అనేది కేవలం నినాదం కాదని, తన జీవిత లక్ష్యం అని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రయాణంలో తనతో కలిసి నడవాలని అధికారులను కోరారు. ఐఏఎస్‌లుగా ఎంపికైన తర్వాత వారు అందుకున్న ప్రశంసలు గతానికి సంబంధించినవని, గతంలో ఉండకుండా భవిష్యత్తును చూడాలని చెప్పారు.  


Similar News