Nirmala Sitharaman: వర్షాకాల సమావేశాల్లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ- నిర్మలా సీతారామన్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నూతన ఆదాయపు పన్ను బిల్లు చర్చకు తీసుకొస్తామని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నూతన ఆదాయపు పన్ను బిల్లు చర్చకు తీసుకొస్తామని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలకు సమాధానమిస్తూ.. ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తోందని అన్నారు. తయారీ రంగానికి ఊతం ఇచ్చేందుకు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు, సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకే కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ అని వెల్లడించారు. వస్తు, సేవల పన్ను నుంచి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటి రోజు నాటికి సెలెక్ట్ కమిటీ తన నివేదికను సమర్పించనున్నట్లు తెలిపారు.
కొత్త ఐటీ చట్టం
ఇకపోతే, ఆదాయపు పన్ను చట్టం- 1961 సవరించనున్నారు. అయితే, కొత్త బిల్లులో ఎలాంటి కొత్త పన్నులుప్రవేశపెట్టలేదని.. పన్ను చట్టాలను సరళీకృతం చేయడం,,అస్పష్టతలను తొలగించడం, పన్ను చెల్లింపుదారుల సమ్మితని సులభతరం చేయడంపైనే దృష్టి సారిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆదాయపు పన్ను చట్టం-1961'లోని అంశాలనే స్పష్టంగా, సంక్షిప్తంగా, సరళమైన భాషలో, పునరావృతాలు లేకుండా రాయించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళీకరించిన ఈ అంశాలే 'నూతన ఆదాయపు పన్ను బిల్లు'లో ఉంటాయి. మరోవైపు, కొత్త బిల్లులోని పదాల సంఖ్య 2.6 లక్షలు కాగా.. ఇది పాత చట్టంలోని 5.12 లక్షల కంటే తక్కువ. ప్రస్తుత చట్టంలో 819 సెక్షన్లు ఉండగా.. కొత్త బిల్లులో 536 ఉన్నాయి. చాప్టర్స్ సంఖ్యను కూడా 47 నుంచి 23కి తగ్గించారు. కొత్త బిల్లులో 1200 నిబంధనలు, 900 వివరణలను తొలగించారు. ఇకపోతే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ప్రారంభమై ఆగస్టు వరకు జరుగుతాయి.