ఎన్డీయే కూటమి విజయం.. చేతి వేలు నరుక్కుని దేవతకు సమర్పించిన బీజేపీ కార్యకర్త
ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ఓ బీజేపీ కార్యకర్త తన చేతి వేలు నరుక్కుని దేవతకు మొక్కు తీర్చుకున్నాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ఓ బీజేపీ కార్యకర్త తన చేతి వేలు నరుక్కుని కాళీ మాతకు సమర్పించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేరిన అతడికి వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడగలిగారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఛత్తీస్ గఢ్ బలరామ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ రోజు తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో ఆందోళన చెందిన 30 ఏళ్ల బీజేపీ కార్యకర్త దుర్గేష్ పాండే.. వెంటనే స్థానికంగా ఉన్న కాళికాదేవి ఆలయానికి పరుగు పరుగున వెళ్లాడు. ఎన్డీయే కూటమిని గెలిపించాలని అలా గెలిస్తే తన వేలును నరుక్కుంటానని మొక్కుకున్నాడు.
అయితే అంతిమ ఫలితాల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ 272 మార్కును దాటింది. ఇది చూసిన పాండే ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే అతడు కాళికా దేవి ఆలయానికి వెళ్లి అక్కడ తన ఎడమ చేతి వెలును నరుక్కుని అమ్మవారికి సమర్పించాడు. ఆ తర్వాత గాయానికి వస్త్రాన్ని కట్టి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో అతడి పరిస్థితి దిగజారుతుందని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే సమరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి అంబికాపూర్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడ రక్తస్రావాన్ని అపేందుకు ఆపరేషన్ చేసిన వైద్యులు చికిత్సలో జాప్యం కారణంగా తెగిపడిన అతడి వేలును మాత్రం తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం పాండే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.