Ncp congress: నేషనల్ కాన్ఫరెన్స్ 51, కాంగ్రెస్ 32.. జమ్మూ కశ్మీర్‌లో పొత్తు ఖరారు

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ షేరింగ్ సోమవారం ఖరారైంది.

Update: 2024-08-26 15:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ షేరింగ్ సోమవారం ఖరారైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. 5 స్థానాల్లో స్నేహ పూర్వక పోటీ జరగనుండగా..సీపీఎం, ఫాంథర్స్ పార్టీకి 2 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ కర్రా సోమవారం శ్రీనగర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో భేటీ అయ్యారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీట్ షేరింగ్ ఫార్ములాను ప్రకటించారు.

సీట్ల పంపకాల ప్రకటన అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోరాడతాయన్నారు. మతతత్వ శక్తులతో పోరాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌ ఆత్మను నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిని కాపాడటమే ఇండియా కూటమి లక్ష్యమని వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.


Similar News