'నాలుగు రాష్ట్రాలే స్పందిస్తాయా?'.. సమాచారం ఇవ్వని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Update: 2023-07-24 13:57 GMT

న్యూఢిల్లీ : విద్యార్థినులకు పీరియడ్స్ టైంలో స్కూళ్లలో కల్పించాల్సిన కనీస వసతులపై జాతీయ విధాన రూపకల్పన విషయంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల (హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్) నుంచి మాత్రమే స్పందన వచ్చిందని తెలిపింది. రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణలో బాలికలకు సహకరించేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు అనుసరించాల్సిన పద్ధతులతో జాతీయ విధానాన్ని సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇప్పటివరకు దీనిపై నాలుగు రాష్ట్రాలు మాత్రమే కేంద్రంతో చర్చించి.. సమాచారం, సూచనలు ఇచ్చాయి.

ఇదే విషయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం.. సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆగస్టు 31లోగా కేంద్రానికి సూచనలు, సమాచారం ఇవ్వాలని వాటిని ఆదేశించింది. అలా చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జాతీయ విధాన రూపకల్పనలో సమాచారం ఇవ్వని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.


Similar News