Kolkata rape case: ఒకరి కంటే ఎక్కువ మంది నేరంలో పాల్గొన్నారు

కోల్ కతా మెడికో అత్యాచారం, హత్యపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ మహిళా కమిషన్ (NCW) చీఫ్ రేఖా శర్మ నిప్పులు చెరిగారు.

Update: 2024-08-18 04:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా మెడికో అత్యాచారం, హత్యపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ మహిళా కమిషన్ (NCW) చీఫ్ రేఖా శర్మ నిప్పులు చెరిగారు. దీదీ ఏదో దాస్తోందని ఆరోపించారు. ఇది ఒకరు చేసిన పనిలా అన్పించడం లేదని.. మమతా బెనర్జీ కొంతమందిని రక్షించాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దగ్గర ఉందని గుర్తుచేశారు. సీబీఐ విచారణ పూర్తయిన తర్వాత దీదీ ఏమి దాచేందుకు ప్రయత్నించారో తెలుస్తుందన్నారు. కోల్ కతా అత్యాచారం, హత్య కేసులో తప్పుడు చర్యతో తనను తాను రక్షించుకున్నానని దీదీ భావించారని పేర్కొన్నారు.

దీదీ ప్రభుత్వంపై ఆగ్రహం

కోల్ కతా అత్యాచారం, హత్య కేసు బయటకి రావడంతో దేశం ఉలిక్కిపడిందని.. ప్రజలు వీధుల్లోకి వచ్చారని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ అన్నారు. డాక్టర్లు, పారామెడిక్స్, ప్రతిపక్షాలు సహా సాధారణ పౌరులు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ భయానక ఘటనపై ఫైర్ అవుతున్నారని తెలిపారు. మమతా బెనర్జీ, ఆమె పార్టీపై ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారని వెల్లడించారు. కేసుని పక్కదోవ పట్టించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారని తెలిపారు. ఈ కేసులో దీదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. ఇకపోతే, ఆగస్టు 9న కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.


Similar News