Veer Savarkar: ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. మార్చాలంటూ పట్టుబట్టిన కాంగ్రెస్

ఢిల్లీలోని నజాఫ్ గఢ్ లో నిర్మించనున్న కాలేజీ విషయంలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Update: 2025-01-03 08:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని నజాఫ్ గఢ్ లో నిర్మించనున్న కాలేజీ విషయంలో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఢిల్లీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్లతో వీర్‌సావర్కర్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థపాన చేయనున్నారు. అయితే, కాలేజీకి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) పేరుని పెట్టాలని కాంగ్రెస్ మోడీకి లేఖ రాసింది. సావర్కర్‌ (Veer Savarkar) అప్పట్లో బ్రిటీష్‌ వారికి క్షమాపణ చెప్పి వారి నుంచి పింఛను పొందారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. అలాంటి వ్యక్తి పేరు కాలేజీకి పెట్టొద్దని కాంగ్రెస్‌, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన మన్మోహన్ పేరుని కాలేజీకి పెట్టాలన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ప్రారంభించింది ఆయనే అని గుర్తుచేశారు. 1991లో ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలకు గుర్తుగా మన్మోహన్‌ పేరుపై కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బ్రిటీష్ వారికి క్షమాభిక్ష పత్రాలు రాసి వారి నుంచి పింఛన్లు తీసుకున్న వారికి చట్టబద్ధత కల్పిస్తున్న బీజేపీ.. స్వాతంత్య్ర సమర యోధులను మాత్రం విస్మరిస్తోందని రాజ్యసభ ఎంపీ హుస్సేన్ ఆరోపించారు. “ప్రధాని మోడీ ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పారు. కాలేజీకి సావర్కర్ పేరు ఎలా పెడతారు?" కాంగ్రెస్ ఎంపీ సుఖ్ జిందర్ రంధవా అన్నారు.

కాంగ్రెస్ ఆరోపణలు తోసిపుచ్చిన బీజేపీ

ఇకపోతే, కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఈవిషయంలో కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేయాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించలేదన్నారు. అందువల్లే, సావర్కర్ పేరుని ఢిల్లీలోని కాలేజీకి పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. వీర్‌ సావర్కర్‌ గౌరవార్థం ఢిల్లీలోని కాలేజీకి ఆయన పేరు పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని సచ్ దేవా పేర్కొన్నారు. సావర్కర్‌ను ఇందిరాగాంధీ, ఉద్ధవ్ ఠాక్రే వంటి నేతలు పొగిడారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా గుర్తుచేశారు. కాలేజీకి సావర్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతించారు.

Tags:    

Similar News