Coast Guard: గుజరాత్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) కు చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో (Chopper Crash) కుప్పకూలింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) కు చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో (Chopper Crash) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది చనిపోయినట్లు తెలుస్తోంది. కోస్ట్‌గార్డ్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఐసీజీ అధికారులు ప్రకటించారు. హెలికాఫ్టర్ ఫ్లై అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వారు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ ప్రమాదంపై కోస్టు గార్డు ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.
గతేడాది ప్రమాదాలు..
ఇప్పటికే ఏఎల్‌హెచ్(ALH) హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టింది. గతేడాది కూడా ఈ తరహా హెలికాఫ్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. వీటిల్లో డిజైన్ సమస్యలు ఉండటంతో చాలా చోట్ల వీటిని వాడటంలేదు. గతేడాది సెప్టెంబర్‌లో ఏఎల్ హెచ్ ఎంకే- 3 (ALH MK-III) హెలికాప్టర్ పోర్‌బందర్ సమీపంలోని అరేబియా సముద్రంలో పడిపోవడంతో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. నెలరోజుల తర్వాత గుజరాత్ తీరంలో మూడో పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత వీటి వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. కొన్నాళ్లకు సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే మరో హెలికాప్టర్ కూలిపోవడం గమనార్హం.