One Nation, One Election: కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కమిటీ..

‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని కేంద్ర సర్కారు శుక్రవారం నియమించింది.

Update: 2023-09-01 16:27 GMT

న్యూఢిల్లీ : ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని కేంద్ర సర్కారు శుక్రవారం నియమించింది. కోవింద్‌ సారథ్యంలోని ఈ కమిటీలో 16 మందిని సభ్యులుగా నియమించింది. దేశంలో లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనా అనే అంశంపై ఈ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించనుంది. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటన చేసిన మరుసటి రోజే జమిలీ ఎన్నికలపై కేంద్రం కమిటీని ప్రకటించడం గమనార్హం.

2014లో జమిలి ఎన్నికల నిర్వహణను బీజేపీ తమ మ్యానిఫెస్టోలో పెట్టింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక లా కమిషన్‌కు జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించింది. దీంతో లా కమిషన్ తన అధ్యయనం కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక త్వరలో కేంద్రానికి అందబోతోంది. అదే సమయంలో రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చే అధ్యయన నివేదికను కూడా పరిశీలించి.. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి సమాచారం.


Similar News