గిరిజనుడి కాళ్ళు కడిగి క్షమాపణ కోరిన సీఎం..

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు.

Update: 2023-07-06 12:17 GMT

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. గురువారం ఉదయం ఆయన గిరిజన కూలీ దశమత్ రావత్ ను తన ఇంటికి పిలిపించి.. కుర్చీలో కూర్చోబెట్టి పాదాలను కడిగారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు. "దశమత్ రావత్ ను వేధించేలా జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధతో నిండిపోయింది. ప్రజలే నాకు దేవుళ్లు" అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈమేరకు మెసేజ్‌తో పాటు దశమత్ రావత్ కాళ్ళు కడుగుతున్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా సీఎం షేర్ చేశారు.

ఇక ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న ప్రవేశ్ శుక్లాను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం ప్రకారం అభియోగాలతో కేసులు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితుని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ప్రవేశ్ శుక్లా పోలీస్ స్టేషన్‌లోకి దర్జాగా వెళ్తున్నట్లు బుధవారం రాత్రి పోలీసులు విడుదల చేసిన వీడియోలో కనిపించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లున్న మరో వీడియోను పోలీసులు గురువారం విడుదల చేశారు. రెండు రోజుల్లో రెండు రకాల వీడియోలను పోలీసులు రిలీజ్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


Similar News