భారత్‌ను కవ్విస్తున్న చైనాకు చెక్.. అమెరికా కీలక నిర్ణయం

సరిహద్దులో నిత్యం భారత్‌ను కవ్విస్తున్న చైనాకు చెక్ పెట్టేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-07-14 11:51 GMT

వాషింగ్టన్ : సరిహద్దులో నిత్యం భారత్‌ను కవ్విస్తున్న చైనాకు చెక్ పెట్టేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ ఒక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ సెనెటోరియల్ కమిటీ ఆమోదించింది. సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హోలెన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్‌లోని సెనేట్ సభ్యులు ఆమోదం తెలిపారు. కొన్ని వారాల క్రితం అమెరికాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. ఇండియా బార్డర్‌లో చైనా సైన్యం ఆగడాల అంశాన్ని ఈ సందర్భంగా బైడెన్ తీవ్రంగా ఖండించారు.

ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూ.. అమెరికా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ చైనా చేస్తున్న ప్రకటనలు వీగిపోయినట్టు అయింది. చైనా అరుణాచల్ ప్రదేశ్‌ని జాంగ్నాన్ అని పిలుస్తుంది. దాన్ని దక్షిణ టిబెట్‌గా డ్రాగన్ అభివర్ణిస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత అగ్రనేతలు, అధికారులు పర్యటించిన సమయాల్లో కూడా విమర్శలు చేయడం చైనాకు అలవాటుగా మారింది. ఈ వాదనను మొదటి నుంచే భారత్ బలంగా ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం “భారతదేశం నుంచి విడదీయరాని భాగం” అని భారత్ తేల్చి చెబుతోంది.


Similar News