ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట..

Update: 2023-10-09 12:22 GMT

న్యూఢిల్లీ : ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. 2009 సంవత్సరం నాటి హత్యాయత్నం కేసులో కేరళ హైకోర్టు అక్టోబర్ 3న ఫైజల్‌ను దోషిగా తేల్చింది. దీంతో ఆయన లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫైజల్‌‌ను దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై సోమవారం స్టే విధించింది. ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

మహ్మద్ ఫైజల్ ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)కి చెందిన లక్షద్వీప్ ఎంపీ. ఫైజల్ 2009లో ఓ కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో దోషిగా తేలిన వ్యక్తుల్లో ఒకరు. ఈ ఏడాది జనవరి 11న కవరత్తిలోని సెషన్స్ కోర్టు ఫైజల్‌ను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆయనకు కవరత్తి సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై స్టే ఇవ్వలేమని తాజాగా ఈనెల 3న కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఫైజల్ కోల్పోయారు. ఈ రెండు సార్లు కూడా సుప్రీంను ఆశ్రయించి ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోగలిగారు.


Similar News