మోడీ 421 సార్లు విభజన అంశాలను ప్రస్తావించారు: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ 421 సార్లు విభజన అంశాలను ప్రస్తావించారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

Update: 2024-05-30 10:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ 421 సార్లు విభజన అంశాలను ప్రస్తావించారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కులం, మతంపై ఓట్లు వేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా మోడీ వాటిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆలయం, మసీదు, ఇతర విభజన సమస్యలపై 421 సార్లు మాట్లాడారని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. గత 15 రోజుల ప్రచారంలో మోడీ 232 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించారని చెప్పారు. కానీ ఒక్కసారి కూడా దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం గురించి మాట్లాడలేదని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఎన్నికైతే ఇవే చివరి ఎన్నికలు అనే ఇండియా కూటమి అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించారని తెలిపారు. 1982లో రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన బయోపిక్ విడుదలైన తర్వాతనే మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. మోడీ గాంధీ గురించి అధ్యయనం చేసి ఉండకపోవచ్చని, కానీ మహాత్ముడి గురించి ప్రపంచమంతా తెలుసని వ్యాఖ్యానించారు.


Similar News