మోడీ, గడ్కరీ హ్యాట్రిక్..ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులు వీరే

లోక్ సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎంతో అనూహ్యమైన తీర్పులు ఇచ్చారు. కొన్ని చోట్లు పలువురు ప్రముఖులు ఓడిపోగా..మరికొన్ని స్థానాల్లో గెలుపొందారు.

Update: 2024-06-04 16:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎంతో అనూహ్యమైన తీర్పులు ఇచ్చారు. కొన్ని చోట్లు పలువురు ప్రముఖులు ఓడిపోగా..మరికొన్ని స్థానాల్లో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ సుమారు లక్షా 50వేల ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి గెలుపొందారు.

శశిథరూర్ నాలుగోసారి

కాంగ్రెస్ నేత శశిథరూర్ కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి గెలుపొందారు. కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 16వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శశిథరూర్‌కు 3,58,155 ఓట్లు రాగా.. చంద్రశేఖర్‌కు 3,42,078ఓట్లు వచ్చాయి. ఇక, కర్ణాటకలోని షిమోగా లోక్‌సభ స్థానంలో మాజీ సీఎం యడియూరప్ప తనయుడు, బీవై రాఘవేంద్ర విజయం సాధించారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూతీపై 97 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్

పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్..కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరిపై విజయం సాధించారు. ఆయనకు 73వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. పఠాన్ తొలిసారి పోటీ చేయడం గమనార్హం. అధిర్ రంజన్ గతంలో అదే స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు.

సినీ నటుల గెలుపు

బీజేపీ తరపున ప్రముఖ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి పోటీకి దిగి గెలుపొందారు. అమె తన సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి 59వేల ఓట్ల మెజార్టీతో గెపొందారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి పోటీ చేసిన నటి హేమమాలిని, మరో నటుడు రవి కిషన్ గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. రామాయణం అనే టీవీ సిరీస్‌లో రాముడి పాత్రకు పేరుగాంచిన నటుడు అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి బరిలో నిలిచి సక్సెస్ అయ్యారు.


Similar News