ఎన్డీయే పక్షనేతగా మోడీ.. ఆ లెటర్ ఇచ్చిన చంద్రబాబు

దిశ, నేషనల్ బ్యూరో : మ్యాజిక్ ఫిగర్ ‘272’కు మించి లోక్‌సభ సీట్లు దక్కడంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమి సర్కారు ఏర్పాటు కానుంది.

Update: 2024-06-05 15:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మ్యాజిక్ ఫిగర్ ‘272’కు మించి లోక్‌సభ సీట్లు దక్కడంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమి సర్కారు ఏర్పాటు కానుంది. శనివారం (జూన్‌ 8న) సాయంత్రం ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ఎన్డీయే కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మోడీ మళ్లీ ప్రధాని పదవిని చేపడితే.. ఇంతకుముందు వరుసగా మూడుసార్లు ప్రధానిగా వ్యవహరించిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు సమం అవుతుంది. ఇక ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి జూన్ 8వ తేదీని ఎంపిక చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన పుట్టిన తేదీ సెప్టెంబరు 17. 1 +7 కలిస్తే 8 అవుతుంది కనుక.. 8వ తేదీని ప్రమాణం కోసం మోడీ ఎంపిక చేసుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

మంత్రిమండలితో మోడీ చివరి భేటీ

బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీ ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రిమండలి సభ్యులతో చివరిసారిగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘గెలవడం, ఓడిపోవడం రాజకీయాలలో ఒక భాగం’’ అని చెప్పారు. ‘‘ఎన్నికల్లో నంబర్ గేమ్ కొనసాగుతుంటుంది.. పదేళ్లుగా మనం మంచి పనే చేశాం.. భవిష్యత్తులో కూడా అలాగే పనిచేద్దాం’’ అని తెలిపారు. ‘‘ప్రజల అంచనాలను అందుకునే ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. మీరందరూ బాగా పనిచేశారు. చాలా కష్టపడ్డారు’’ అని పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ తన మంత్రిమండలితో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. 17వ లోక్‌సభను రద్దు చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోడీ టీమ్‌ను కోరారు.

నితీశ్, చంద్రబాబు లేఖలు

బుధవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్డీయే కూటమిలోని రాజకీయ పార్టీలు సమావేశమై.. ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానం చేశాయి. ఈ మీటింగ్ సందర్భంగా ఎన్డీయే కూటమికి మద్దతును ప్రకటించే లేఖలను జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు అమిత్‌‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్‌ పాసవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 7కల్లా క్లారిటీ..

ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ, టీడీపీ వంటి పార్టీలు ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులను ఆశిస్తున్నాయి. ఈక్రమంలోనే గురు, శుక్రవారాల్లో కేంద్ర మంత్రివర్గ కూర్పుపై, ఏ పార్టీ నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు కేటాయించాలనే అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. లోక్​సభ స్పీకర్​ లాంటి పదవుల పంపకాలపైనా నిర్ణయాన్ని తీసుకోనున్నారు. జూన్ 7న ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్​లోని సెంట్రల్​ హాల్​లో సమావేశం కానున్నారు. శుక్రవారంకల్లా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం.


Similar News