ప్రమాణ స్వీకారం చేసిన మిజోరం సీఎం లాల్దుహోమా
తెలంగాణతో పాటు మిజోరం రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణతో పాటు మిజోరం రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ (జెడ్‌పీఎం) అధినేత లాల్దుహోమా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవలే జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 27 నియోజకవర్గాల్లో జెడ్‌పీఎం పార్టీ గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. కాగా, 74 ఏళ్ల వయసున్న లాల్దుహోమా.. ఐపీఎస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. గోవా, ఢిల్లీలో ఆయన ఐపీఎస్‌గా పని చేశారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 1984లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.