Allahabad High Court: '18 ఏళ్లలోపు వారి సహజీవనం చట్టవిరుద్ధం'

మైనర్లు (18ఏళ్లలోపువారు) సహజీవనం చేయడం చట్టవిరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది.

Update: 2023-08-02 16:43 GMT

లక్నో : మైనర్లు (18ఏళ్లలోపువారు) సహజీవనం చేయడం చట్టవిరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. మేజరైన అమ్మాయితో సహజీవనం చేసినా.. మైనర్ అబ్బాయిలు నేర విచారణ నుంచి రక్షణ పొందలేరని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్నిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19ఏళ్ల అమ్మాయి, 17ఏళ్ల అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేయడం ప్రారంభించారు. తమ అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆచూకీ తెలిసిన తర్వాత అమ్మాయి కుటుంబసభ్యులు ఆమెను బలవంతంగా తమ ఊరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. అబ్బాయి తరఫున అతని తండ్రి కోర్టులో పిటిషన్‌ వేశారు. అబ్బాయిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు... 18ఏళ్లలోపువారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉన్నప్పటికీ... వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.


Similar News