ఆ స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని భావిస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు.

Update: 2024-03-25 05:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని భావిస్తున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు. ఈ స్థానాల్లో రాహుల్, ప్రియాంకా గాంధీలు బరిలోకి దిగుతారనే నమ్మకం ఉందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్, ప్రియాంక గాంధీలు ఈ రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు.

కాగా, రాయ్‌బరేలీ, అమేథీ సెగ్మెంట్లు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి బరిలో నిలిచిన సోనియా గాంధీ గెలుపొందగా, అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయారు. అయితే అనారోగ్యం కారణంగా సోనియా ఎంపీగా పోటీ చేయబోనని తెలిపారు. రాహుల్ సైతం కేరళలోని వయనాడ్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఈ రెండు సెగ్మెంట్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇక్కడి నుంచి గాంధీ కుటుంబ సభ్యలే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ‘ప్రియాంకా గాంధీ జీ రాయ్ బరేలీ పిలుస్తోంది’ అనే పోస్టర్లను సైతం వేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని 17స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇప్పటివరకు 9మంది అభ్యర్థులను ప్రకటించింది.

Tags:    

Similar News