మోడీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రి ఇతనే..

మోడీ 3.0 ప్రభుత్వంలోని మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయసు కేంద్ర మంత్రి కావడం విశేషం.

Update: 2024-06-09 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం వేలాది మంది అతిథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ వర్గాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందరినీ ఆకట్టుకున్నారు. ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు కావడమే అందుకు కారణం. మోడీ 3.0 ప్రభుత్వంలోని మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయసు కేంద్ర మంత్రి కావడం విశేషం. 2012లో తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కె ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో ఆయన కుమారుడు రామ్మోహన్ సింగపూర్‌లో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేవలం 26 ఏళ్ల వయసులో శ్రీకాకుళం నుంచి 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గెలుపొందారు. ఆ ఏడాది ఎన్నికైన రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీ కూడా అయ్యారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ఆయన ఎంపీగా విజయం సాధించారు. తొలినుంచి రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మెరుగైన పనితీరు కలిగిన ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్‌లో రుతుక్రమ ఆరోగ్య విద్య, లైంగిక విద్య గురించి చర్చించిన ఎంపీల్లో ఆయన ఒకరు. అంతేకాకుండా శానిటరీ ప్యాడ్‌లపై జీఎస్టీని తొలగించాలని కూడా ఆయన ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి 3.27 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 


Similar News