Mecca: నీట మునిగిన మక్కా.. భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం
ముస్లింలు పవిత్రంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కా నగరం నీట మునిగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానతో పాటు భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింలు పవిత్రంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కా (Mecca) నగరం నీట మునిగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానతో పాటు భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. మక్కా, మదీనాలోని కొన్ని ప్రాంతాలు, జెడ్డా (Jedda) నగరం అతలాకుతలం అవుతోంది. భారీ వరదలతో మక్కా ప్రాంతం అంతా చెరువును తలపిస్తోంది. పలు కార్లు నీటిలో కొట్టుకు పోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనేక బస్సులు రోడ్డు మీదే నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినట్టు సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తెలిపింది.
వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో సౌదీ అరేబియా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాన్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత వర్షాల వల్ల అల్-ఉలా, అల్-మదీనా, ముస్లింల పవిత్ర స్థలం అల్-మదీనాలోని మస్జిద్-ఎ-నబవి, రియాద్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. అనేక మసీదులు నీటితో నిండిపోయిన వీడియోలె వైరల్‌గా మారాయి. కాగా, 2009లో జెడ్డాలో విపత్తు సంభవించి 100 మందికి పైగా మరణించారు. అలాగే గతేడాది 2024లోనూ పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ప్రస్తుత వరదల వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే వివరాలు వెల్లడించలేదు.