Bombay High Court: మేధస్సు తక్కువున్న మహిళకు తల్లయ్యే హక్కు లేదా?

మేధస్సు తక్కువ ఉన్నంత మాత్రాన మహిళకు తల్లయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు(Bombay High Court) ప్రశ్నించింది.

Update: 2025-01-08 12:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మేధస్సు తక్కువ ఉన్నంత మాత్రాన మహిళకు తల్లయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు(Bombay High Court) ప్రశ్నించింది. ఓ 27 ఏళ్ల గర్భిణి తండ్రి తన కుమార్తె అబార్షన్‌ చేయించేందుకు (Medical Termination of Pregnancy) అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన కుమార్తెకు తెలివి తక్కువగా ఉందని(intellectual disability), కాబట్టి ఆమెకు గర్భస్రావం చేయించేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌వీ ఘూగే, జస్టిస్‌ రాజేశ్‌ పాటిల్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. మేధస్సు తక్కువగా ఉన్న మహిళలు పిల్లలను కనకూడదని చెప్పడం చట్ట విరుద్ధమని తెలిపింది. గర్భిణి మానసిక స్థితి సరిగానే ఉందని నిర్ధారణకు వచ్చింది. కేవలం ఆమె ఐక్యూ స్థాయిలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఐక్యూ తక్కువగా ఉందనే కారణంతో ఆమెకు తల్లయ్యే హక్కు లేదనడం చట్ట విరుద్ధమంది. తాను గర్భం దాల్చడానికి కారణం ఎవరో కూడా ఆమె చెబుతుందని తెలిపింది. గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు అతడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని సూచించింది.

ఇద్దరూ మేజర్లే..

గర్భిణి, ఆమె గర్భానికి కారణమైన వ్యక్తి ఇద్దరూ మేజర్లే అని బాంబే హైకోర్టు గుర్తుచేసింది. ఇష్టపూర్వకంగానే అతడితో రిలేషన్‌లో ఉన్నానని మహిళ చెబుతుందని.. అందుకే దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు వెల్లడించింది. నిందితుడు గర్భిణిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకోకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. కేసు తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది. అయితే, ఈ కేసుపై గతంలో విచారణ జరగగా.. గర్భిణి మానసిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ముంబైలోని జేజే ఆస్పత్రిలో మెడికల్ బోర్డు సమక్షంలో పరీక్షలు చేయించాలని కోర్టు పేర్కొంది. దీంతో, బుధవారం మెడికల్‌ బోర్డు.. బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు నివేదికను సమర్పించింది. గర్భిణి మానసిక స్థితి సరిగానే ఉన్నదని, కాకపోతే ఆమె ఇంటెలిజెన్స్‌ స్థాయి ఐక్యూ 75 (IQ) తో సగటు ఇంటెలిజెన్స్‌ కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మహిళ గర్భంలోని పిండం వయసు 21 వారాలని, గర్భస్రావం చేయడానికి వీలు పడుతుందని పేర్కొంది. కాగా.. దీనిపైనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Read More ...

షాకింగ్ ఘటన.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి


Tags:    

Similar News