ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు.. మాయావతి కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల దారుణ హత్యకు గురైన తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌‌కు చెన్నైలోని తిరువళ్లువర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Update: 2024-07-07 19:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల దారుణ హత్యకు గురైన తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌‌కు చెన్నైలోని తిరువళ్లువర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి చెన్నై నగరంలోని పెరంబూరులో ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ నివాసానికి చేరుకొని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన భార్యను, కుటుంబసభ్యులను కలిసి మాయావతి మాట్లాడారు. వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మాయావతి మీడియాతో మాట్లాడుతూ... స్థానిక పోలీసులు అరెస్టు చేసిన వారు అసలు దోషులే కాదన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును చూస్తుంటే తమిళనాడులో లా అండ్ ఆర్డర్ ఏమీ లేదని అనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా బీఎస్పీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని మాయావతి ప్రకటించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాయావతి వెంట బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ ఉన్నారు. కాగా, చనిపోయిన గ్యాంగ్ స్టర్ ఆర్కాట్ సురేష్ సహచరులే ఆర్మ్‌స్ట్రాంగ్‌‌‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆర్మ్‌స్ట్రాంగ్‌ భార్య పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు

చెన్నై నగరంలోని బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఖననం చేసేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం.. బీఎస్పీ ఆఫీసు జనావాసాల మధ్య ఉన్నందున అక్కడ ఖననం చేసేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ‘‘ఇరుకు వీధుల మధ్యలో బీఎస్పీ ఆఫీసు ఉంది. అంత్యక్రియలకు వేలాది మంది వస్తారు. మేం ఒకవేళ అక్కడ అంత్యక్రియలకు అనుమతిస్తే హత్రాస్ ఘటన తరహాలో తొక్కిసలాట జరిగే ముప్పు ఉంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దీంతో తిరువళ్లువర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

ద్రవిడ మోడల్.. మర్డర్ మోడల్‌గా మారింది : తమిళిసై

ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురైన ఘటనపై బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం పాటిస్తున్న ద్రవిడ పాలనా విధానం ఇప్పుడు మర్డర్ మోడల్‌గా మారిపోయిందని ఆమె విమర్శించారు. ‘‘ఇటీవలే తమిళనాడులో ఓ అన్నాడీఎంకే కార్యకర్త, ఓ పీఎంకే కార్యకర్త, ఓ బీజేపీ కార్యకర్త కూడా హత్యకు గురయ్యారు. రాజకీయ హత్య పెరిగిపోతున్నా సీఎం స్టాలిన్ మౌనం వీడటం లేదు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ అవసరం’’ అని తమిళిసై పేర్కొన్నారు.


Similar News