మావోయిస్టు టాప్ కమాండర్ సుధీర్ హతం

తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ సుధీర్‌గా పోలీసులు చెబుతున్నారు. ఆయనపై రూ.25లక్షల రివార్డు కూడా ఉంది.

Update: 2025-03-25 13:42 GMT
మావోయిస్టు టాప్ కమాండర్ సుధీర్ హతం
  • whatsapp icon

- మరో ఇద్దరు మావోయిస్టులు కూడా

- దంతెవాడ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

- తెలంగాణకు చెందిన సుధీర్‌పై రూ.25 లక్షల రివార్డు

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో ఒక ఉన్నత స్థాయి కమాండర్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టుల కదలిక గురించి నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అక్కడకు భద్రతా దళాలు కూబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో భద్రతాదళాలకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు మొదలయ్యాయి. సాయుధులైన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ అన్నారు. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత జరిగిన కూంబింగ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

చనిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సుధీర్ కూడా ఉన్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ సుధీర్‌గా పోలీసులు చెబుతున్నారు. ఆయనపై రూ.25లక్షల రివార్డు కూడా ఉంది. మిగిలిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఒక ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, .303 రైఫిల్, ఒక 12 బోర్ రైఫిల్‌తో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడానికి ఈ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు చేస్తున్నాయి. ఇవి ఇంకా కొనసాగుతాయని దంతెవాడు డీఐజీ కమలోచన్ కశ్యప్ తెలిపారు.

బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 100 మంది మావోయిస్టులు హతమైనట్లు చెప్పారు. బస్తర్ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించి, భద్రతను పెంపొందించడానికి భద్రతా దళాలు కృషి చేస్తున్నాయని అన్నారు. మార్చి 20న బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇది జరిగిన ఐదు రోజులకే తాజా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బస్తర్, దంతెవాడ, బీజాపూర్ వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ప్రచారాలను ప్రభుత్వం ముమ్మరం చేసింి. భద్రతాదళాల కార్యకాలాపాలు పెంచడంతో పాటు మావోయిస్టుల నెట్‌వర్క్‌లను నిర్మూలించే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.

Tags:    

Similar News