కోల్‌కతా హత్యాచార ఘటనపై మమతా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనల నేపథ్యంలో మమతా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది

Update: 2024-09-17 14:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనల నేపథ్యంలో మమతా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల వైద్యులతో ముఖ్యమంత్రి మమతా చర్చలు జరిపిన తరువాత కమిషనర్‌ వినీత్‌ గోయల్‌‌ను తొలగించి 1998 బ్యాచ్ IPS అధికారి అయిన మనోజ్ కుమార్‌ వర్మను ఆ పోస్ట్‌లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వినీత్‌ను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ)గా బదిలీ చేశారు.

అలాగే, వైద్యుల డిమాండ్ మేరకు బెంగాల్ ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా డాక్టర్ కౌస్తవ్ నాయక్‌ను, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌గా డాక్టర్ దేబాసిష్ హల్డర్‌ను తొలగించినట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్‌జీ కర్ హత్యాచారం కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైద్యులు నిరసన చేపడుతుండగా, వారితో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరపగా, ఐదు డిమాండ్లను ఆమె ముందు ఉంచారు. వీటిలో మూడింటిని అంగీకరించారు.

అందులో భాగంగా చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే కమిషనర్‌ వినీత్‌ గోయల్‌‌ను తొలగించడంతో పాటు పలువురు వైద్య సిబ్బందిని సైతం తొలగిస్తూ సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మమతా, వైద్యుల డిమాండ్లను 99 శాతం తీర్చాం. సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా తిరిగి డ్యూటీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.


Similar News