Manish Sisodia :17 నెలల జైలు జీవితంపై మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు ఎట్టకేలకు 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.

Update: 2024-08-09 15:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు ఎట్టకేలకు 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సిసోడియాకు బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులు విచారణలో ఉన్నాయని చెప్పి.. ఇష్టం వచ్చినంత కాలం పాటు ఏ నిందితుడినీ జైలులో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అలా ఉంచాలని భావిస్తే.. ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం అనేది నిందితుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. ‘‘బెయిల్‌ అనేది ఒక నియమం.. జైలు నుంచి నిందితుడికి మినహాయింపు అనే అంశాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన టైం వచ్చింది’’ అని బెంచ్ కామెంట్ చేసింది.

జైలు వద్ద ఆప్ శ్రేణుల కోలాహలం

గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా జైలు నుంచి బయటికొస్తున్న సందర్భంగా పెద్దసంఖ్యలో ఆయన మద్దతుదారులు తిహార్ జైలు వద్దకు చేరుకొని స్వాగతం పలికారు. సిసోడియాకు స్వాగతం పలికిన ఆప్ సీనియర్ నేతల్లో సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్ కూడా ఉన్నారు. ఈసందర్భంగా ఆప్ శ్రేణులు భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేశాయి. వారందరినీ ఉద్దేశించి సిసోడియా భావోద్వేగంతో ప్రసంగించారు. ‘‘జైలులో నేను ఒంటరిగా లేను. అక్కడ ఉన్నన్ని రోజులు ఢిల్లీ ప్రజలు, దేశంలోని చిన్నారులంతా మానసికంగా నాతోనే ఉన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

తనకు బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపపెట్టు లాంటిదని సిసోడియా పేర్కొన్నారు. ‘‘ప్రజల ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు, సత్యానికి ఉన్న బలం నా వెంట నిలిచాయి. వీటన్నింటికి మించి దేశ రాజ్యాంగానికి ఉన్న శక్తితో నేను బయటకు రాగలిగాను. న్యాయ పోరాటాన్ని ఓ ముగింపునకు తీసుకురాగలిగాను’’ అని సిసోడియా తెలిపారు. ఇదే రాజ్యాంగ శక్తి త్వరలోనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విడుదలకు కూడా మార్గం సుగమం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ న్యాయ పోరాటంలో తనకు అండగా నిలిచిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వికి సిసోడియా ధన్యవాదాలు చెప్పారు.

Tags:    

Similar News