Supreme Court: "అపరిమిత కాలం" జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఉపశమనం దొరికింది.

Update: 2024-08-09 07:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఉపశమనం దొరికింది. దాదాపు 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు వెల్లడించింది. అపరిమిత కాలం సిసోడియాను జైలులో ఉంటడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని కోర్టు పేర్కొంది. వేగవంతమైన విచారణకు సిసోడియా అర్హుడని, ఆయన్ని తిరిగి ట్రయల్ కోర్టుకు పంపడం స్నేక్స్ అండ్ లాడర్స్ ఆట లాంటిదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రూ. 10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఆ మొత్తానికి ఇద్దరు ష్యూరిటీలు అవసరమని తెలిపింది. అయితే, బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని సూచించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయాన్ని సందర్శించకూడదని పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేస్తే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని సిసోడియాను కోర్టు హెచ్చరించింది.

కిందికోర్టులపై సుప్రీం ఆగ్రహం

సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ లేకుండా "అపరిమిత కాలం" జైలులో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంది. "18 నెలల జైలుశిక్ష.. విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. సత్వర విచారణకు అప్పీలుదారుకు హక్కు లేకుండా పోయింది" అని జస్టిస్ గవాయ్ దిగువ కోర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “బెయిల్ నియమం, జైలు మినహాయింపు.. బెయిల్ ని శిక్షగా నిలిపివేయకూడదని కోర్టులు మరచిపోయాయి.” ట్రయల్ కోర్టు, హైకోర్టులు ఈ విషయాన్ని గ్రహించాలని హితవు పలికింది. “అప్పీలుదారుకు సమాజంలో పలుకుబడి ఉంది. పారిపోయే భయం లేదు. ఎలాగైనా... షరతులు విధించవచ్చు." అని పేర్కొంది. ఇకపోతే, సిసోడియాను ఫిబ్రవరి 26, 2023న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత రెండు వారాలలోపే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అయితే, ప్రాసిక్యూషన్ విచారణ తేదీ వరకు పని చేస్తున్నప్పుడు సిసోడియా నిరవధికంగా జైలులో ఉండలేడని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండుకేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం తీర్పుపై సీనియన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ హర్షం వ్యక్తం చేశారు.


Similar News