Manipur voilance: మణిపూర్‌లో విద్యార్థుల భారీ నిరసన.. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్

మణిపూర్‌లో ఇటీవల జరుగుతున్న డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు తెలిపారు.

Update: 2024-09-09 12:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో ఇటీవల జరుగుతున్న డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా భారీ నిరసనలు తెలిపారు. పలువురు పాఠశాల, కళాశాల విద్యార్థులు సోమవారం రాజ్‌భవన్‌ వైపు ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు. రాష్ట్రంలో గతేడాది నుండి కొనసాగుతున్న హింస పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు, గవర్నర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక నైతిక కారణాలతో 50 మంది ఎమ్మెల్యేలు సైతం రిజైన్ చేయాలని తెలిపారు. హింసాత్మక పరిస్థితులను నియంత్రించడంలో విఫలమైన పారామిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు.డ్రోన్ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.

విద్యార్థులు రాజ్ భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు, భద్రతా బలగాలు బారికేడ్లు వేసి వారిని అడ్డుకున్నారు. గుంపును చెదర గొట్టేందుకు పలు రౌండ్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధన్మంజూరి యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. జైలులో ఉండటానికి, ఇంఫాల్‌లో ఉండటానికి తేడా లేదని, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేసేందుకే ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కాగా, గత 7 రోజులుగా రాష్ట్రంలో హింస పెరిగింది. మిలిటెంట్లు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో 8 మంది మరణించగా..15 మందికి పైగా గాయపడ్డారు.  


Similar News