మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత.. సైనికులను అడ్డుకున్న మహిళలు
మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నించిన సైన్యాన్ని వందలాది మంది మహిళలు అడ్డుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తరలించేందుకు ప్రయత్నించిన సైన్యాన్ని వందలాది మంది మహిళలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. మహిళా నిరసనకారులను అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు అధికారులు. అయినా, మహిళలు వెనక్కి తగ్గలేదు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనికులు.. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన రెండు ఎస్ యూవీ వాహనాలను అడ్డుకున్నారు. ఇది గమనించిన వాహనాల్లోని వ్యక్తులు వాటిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
కొద్దిసేపటికే మీరా పైబీ బృందానికి చెందిన వందలమంది మహిళలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఆయుధాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గతేడాది మేలో మణిపూర్ లో అల్లర్లు ప్రారంభం కాగా.. అవి ముగిసేవరకు ఎలాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోవద్దన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆర్మీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బలగాలు గాల్లో కాల్పులు జరిపినా ఫలితం లేకపోయింది. దీనిపై సమాచారం అందుకున్న మణిపూర్ పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఆయుధాలను పోలీసులకు అప్పగిస్తామని సైనికులు చెప్పడంతో మహిళలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో ఆర్మీ అధికారులు వెనుతిరిగారు. ఇకపోతే కుంభీ వంటి సరిహద్దు ప్రాంతంలోని వాలంటీర్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుంటే.. మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉందని మహిళా నిరసనకారులు తెలిపారు.