Manipur: మణిపూర్‌లో భారీగా పోలీసు ఆయుధాల లూటీ..

మణి పూర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు.

Update: 2023-08-04 10:24 GMT

ఇంఫాల్ : మణి పూర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బిష్ణుపుర్‌ జిల్లా నారన్‌సైనాలో ఉన్న 2వ ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బీ) ప్రధాన కేంద్రంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను ఎత్తుకెళ్లారు. కొన్ని ఏకే47 రైఫిళ్లు, 3 ఘటక్‌ రైఫిళ్లు, 195 సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిళ్లు, ఐదు ఎంపీ-5 గన్‌లు, 16.9 ఎంఎం పిస్టళ్లు, పదుల సంఖ్యలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లతో పాటు కార్బైన్లు, హ్యాండ్‌ గ్రెనేడ్లను, వివిధ తుపాకులకు చెందిన 19 వేల బుల్లెట్లను అపహరించారు. మరోవైపు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోనూ రెండు ఆయుధ కేంద్రాలపై దాడి చేసి.. లూటీకి విఫలయత్నం చేశారు. 

ఇప్పటివరకు ఈ విధంగా మణిపుర్‌లోని 37 ప్రాంతాల్లో సుమారు 5వేల ఆయుధాలను అల్లరి మూకలు దోచుకున్నట్లు అంచనా. వీటిలో ఎల్‌ఎంజీ, ఎంఎంజీ, ఏకే, ఇన్సాస్‌, అసాల్ట్‌ రైఫిల్స్‌, ఎంపీ5, స్నైపర్‌, కార్బైన్‌లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు మణిపూర్ అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలకు గిరిజన నాయకుల వేదిక (ఐటీఎల్‌ఎఫ్‌) తలపెట్టిన అంత్యక్రియల యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

చురచంద్‌పుర్‌ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం మొదలయ్యింది. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఖనన ప్రదేశానికి గిరిజనులు ప్రదర్శనగా వెళ్తుండగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాయి. దీంతో బిష్ణుపుర్‌ జిల్లాలోని కంగ్వాయి, ఫౌగక్చావోలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు.


Similar News