Manipur: 'అక్రమ వలసలు పెరిగిపోయాయి.. స్వేచ్ఛాయుత రాకపోకలు రద్దు చేయాలి'

Update: 2023-09-23 16:26 GMT

ఇంఫాల్: భారత్-మయన్మార్ సరిహద్దులో స్వేచ్ఛాయుత రాకపోకలు రద్దు చేయాలని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కేంద్ర హోం శాఖను కోరారు. సరిహద్దు కంచెల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుకు ఇరువైపులా నివసించే వ్యక్తులు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా 16 కి.మీ వరకు రెండు భూభాగాలపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించే విధానం (ఫ్రీ మూమెంట్ రెజిమీ) అమలులో ఉంది. అయితే, రాష్ట్రంలోకి పెరిగిన అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సమస్యను అరికట్టేందుకు చేపట్టాల్సిన ప్రాధాన్యతలపై సీఎం బీరేన్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు.

‘అక్రమ వలసదారుల’ సవాల్‌ను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కంచె నిర్మాణం ద్వారా భారత్-మయన్మార్ సరిహద్దును పటిష్టపరచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మణిపూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో 60 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


Similar News