Manipur CM : ‘యూనిఫైడ్ కమాండ్’ నాకే అప్పగించండి.. కేంద్రానికి మణిపూర్ సీఎం డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఎన్.బీరేన్ సింగ్ గుర్రుగా ఉన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంపై సీఎం ఎన్.బీరేన్ సింగ్ గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారాలను ‘యూనిఫైడ్ కమాండ్’ వ్యవస్థ ద్వారా కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తుండటంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ‘యూనిఫైడ్ కమాండ్’ను మునుపటిలా తనకే అప్పగించాలని సీఎం బీరేన్ సింగ్ కోరుతున్నారు. ఈమేరకు డిమాండ్లతో కూడిన మెమొరాండంను ఆదివారం ఉదయం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు ఆయన అందజేశారు. ఈసందర్భంగా సీఎం వెంట అధికార బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నారు. తమ డిమాండ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈసందర్భంగా గవర్నర్‌ను సీఎం బీరేన్ సింగ్, మంత్రులు కోరినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో కుకీ మిలిటెంట్ల కార్యకలాపాలకు వీలును కల్పించే నిబంధనలను రద్దు చేయాలనే డిమాండ్ కూడా మెమొరాండంలో ఉంది.
సీఎం బీరేన్ సింగ్ మెయితీ వర్గానికి చెందిన వారు కావడం వల్లే కుకీ వర్గం మిలిటెంట్లపై కఠిన చర్యలు ఆశిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించేందుకు 1961ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకొని జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ను అమలు చేయాలని కేంద్రాన్ని మణిపూర్ సీఎం కోరారు.ఒకవేళ ఈ మెమొరాండంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా, మణిపూర్ మాజీ గవర్నర్ అనసూయ ఉయికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై మణిపూర్ ప్రజలు కోపంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా ప్రధానమంత్రి రాష్ట్రంలో అడుగుపెట్టకపోవడంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.