Kolkata rape-murder case protest: నిరసనల్లో మహిళపై లైంగిక వేధింపులు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు.

Update: 2024-09-02 07:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడాలని ఆదివారం సాయంత్రం‘‘అమ్రా తిలోత్తోమా’’ అనే బృందం నిరసన చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న మహిళతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో నిరసనకారులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆందోళనలో పాల్గొన్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. తోటి వారికి తెలియజేయడంతో వారు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడ్ని పోలీసులు వెంటనే విడిచిపెట్టడంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (కేంద్ర) కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రంగంలోకి దిగిన ఉన్నాతధికారులు

దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యల తీసుకున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, అందుకే అతడిని విడిచిపెట్టామని ఘటనా స్థలంలోని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించడంతో మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అతడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే, శాంతియుత నిరసనల్లో పాల్గొనే పౌరులందరికీ భద్రత ఉండేలా పోలీసులు సత్వర చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.


Similar News