Bengal Floods: మమ్మల్ని సంప్రదించకుండా నీటిని విడుదల చేశారు.. ప్రధాని మోడీకి దీదీ మరో లేఖ

పశ్చిమ బెంగాల్‌లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో లేఖ రాశారు.

Update: 2024-09-22 09:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో లేఖ రాశారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) తన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రిజర్వాయర్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్ల అనేక జిల్లాలను వరదలు ముంచెత్తాయన్నారు. కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ ఏకాభిప్రాయానికి రాకుండానే అన్ని కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నోటీసు లేకుండా కొన్నిసార్లు నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను గౌరవించడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, తొమ్మిది గంటల పాటు రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. 3.5 గంటల నోటీసులో ఇలా జరగగా.. సమర్థమంతమైన విపత్తు నిర్వహణకు ఆ సమయం సరిపోదని వెల్లడించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అన్నారు. ఈ విధ్వంసాన్ని పరిష్కరించడానికి వెంటనే కేంద్రం నిధులు మంజూరు చేసి విడుదల చేయాలని కోరారు. ఇకపోతే, గతంలోనూ ఈ అంశంపై ప్రధాని మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు.

గతంలో రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందన..

ప్రధానమంత్రికి మమతాబెనర్జీ గతంలో రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. పెద్ద విపత్తును నివారించడానికి డీవీసీ రిజర్వాయర్ల నుండి నీటిని విడుదల చేశామన్నారు. రాష్ట్ర అధికారులకు ప్రతి దశలోనూ ఈ విషయాన్ని వివరించామన్నారు. దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ.. నీటి విడుదలను నిర్వహిస్తుందన్నారు. ఇఁదులో సెంట్రల్ వాటర్ కమిషన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, డీవీసీ ప్రతినిధులు ఉన్నారని ఆయన వివరించారు. ఇకపోతే, భారీ వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్ అధికారుల విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 14 నుంచి 17 వరకు మైథాన్, పంచేట్ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలను 50 శాతం తగ్గించినట్లు పాటిల్ స్పష్టం చేశారు.


Similar News