Kolkata : కోల్‌కతా ఆస్పత్రిపై దాడి.. దీదీ, బీజేపీ విమర్శల యుద్ధం

దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌‌పై బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరు అల్లరిమూకలు దాడికి తెగబడ్డారు.

Update: 2024-08-15 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌‌పై బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరు అల్లరిమూకలు దాడికి తెగబడ్డారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్, ఇతర వైద్య సదుపాయాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తలే పాల్గొన్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అల్లరిమూకలు బీజేపీ, వామపక్ష పార్టీల జెండాలతో హాస్పిటల్‌లోకి చొరబడి, విధ్వంసం సృష్టించారన్నారు. గురువారం రోజు గవర్నర్‌తో భేటీ అనంతరం దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో విద్యార్థులు ఎవరూ పాల్గొనలేదని, అంతా బయటి వారేనని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం రోజు తాను ర్యాలీ నిర్వహిస్తానని, దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తానని మమతా బెనర్జీ చెప్పారు.

సెమినార్ హాల్‌లోని సాక్ష్యాలను తుడిచి పెట్టేందుకు యత్నం..

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌పై దాదాపు 2500 మంది మూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. ఆస్పత్రిలోని డాక్టర్లపైనా అల్లరిమూకలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. కాలేజీ సెమినార్ హాల్‌లోని సాక్ష్యాలను తుడిచి పెట్టేందుకు అల్లరిమూకలు యత్నించారని ఆస్పత్రిలోని నర్సులు తమకు చెప్పారన్నారు. ఈ దాడికి నిరసనగా శుక్రవారం రోజు తాను ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద దీక్ష చేస్తానని సుకాంత మజుందార్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కోల్‌కతా పోలీసులు, సెమినార్ హాల్‌లోని క్రైమ్ సీన్‌కు ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున సమ్మెను మళ్లీ ప్రారంభిస్తామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా (ఫోర్డా) ప్రకటించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపింది.

జూనియర్ వైద్యురాలి డైరీలోని చివరి వాక్యాలు చదువుతూ.. తండ్రి ఎమోషనల్

కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తండ్రి ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె డైరీలో చివరిసారిగా రాసిన పదాలను ఓ మీడియా సంస్థకు చదివి వినిపిస్తూ.. ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘మా అమ్మాయి బాగా చదివేది. రోజూ 10 నుంచి 12 గంటలపాటు ఆమె చదువుతుండేది. ఎండీ కోర్సు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని గోల్డ్ మెడలిస్ట్ కావాలనేది మా కూతురి జీవిత లక్ష్యం. ఆ విషయాన్నే ఆమె చివరిసారిగా డైరీలో రాసుకుంది’’ అని జూనియర్ వైద్యురాలి తండ్రి వివరించారు. మెడికల్ ప్రొఫెషన్‌లోకి ప్రవేశించాలనేది ఆమె చిరకాల స్వప్నమని చెప్పారు. ‘‘న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. నా కూతుర్ని చంపిన హంతకులకు శిక్షపడితేనే నాకు కొంత ఊరట లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News