Mallikarjun karge:100 రోజుల ఎజెండా అమలులో మోడీ విఫలం.. మల్లికార్జున్ ఖర్గే విమర్శలు

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల ఎజెండాను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శించారు.

Update: 2024-09-12 09:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ వంద రోజుల ఎజెండాను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలను దెబ్బతీయడానికే ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీసుకువచ్చిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం 95 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి గురువారం పలు ప్రశ్నలు సంధించారు. మణిపూర్‌లో 16 నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నప్పటికీ మోడీకి ఆ రాష్ట్రం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులు నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.

‘ఈ వంద రోజుల్లో నీట్ పేపర్ లీక్, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడం, విమానాశ్రయాల పైకప్పు, కొత్త పార్లమెంటు, అయోధ్యలో రామాలయం, ఎక్స్‌ప్రెస్‌వేలు, వంతెనలు, రోడ్లు, సొరంగాలు, మీరు నిర్మించారని చెప్పుకునే వాటిలో అన్ని లోపాలు వెలుగు చూశాయి’ అని పేర్కొన్నారు. రైల్వే భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందని, నగరాలు వరదల్లో చిక్కుకున్నా రాష్ట్రాలకు తగిన సహాయం అందించలేదని వెల్లడించారు. అదానీ స్కామ్ బయటపడినా దానిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఇండియా కూటమి పార్టీల ఒత్తిడి కారణంగా వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినట్టు ఖర్గే గుర్తు చేశారు.


Similar News