ఎట్టకేలకు లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన జయసూర్య
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటుడు జయసూర్యపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా, ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు జయసూర్య ఆదివారం ఉదయం ఎట్టకేలకు స్పందించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టిపారేశారు. నాపై చేసిన ఆరోపణలు నన్ను, నా కుటుంబాన్ని, సన్నిహితులను తీవ్రంగా బాధించాయి, ఈ కేసుకు సంబంధించి మిగిలిన విచారణలను నా న్యాయ బృందం చూసుకుంటుంది. మనస్సాక్షి లేని ఎవరికైనా తప్పుడు ఆరోపణలు చేయడం సులభం. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుంది, కానీ నిజం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను అని ఆయన అన్నారు.
చట్టపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వ్యక్తిగత పనుల కారణంగా, నేను, నా కుటుంబం గత నెల రోజులుగా అమెరికాలో ఉన్నాము. నా పని ముగిసిన వెంటనే తిరిగి వస్తాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అన్ని చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోస్ట్‌లో తెలిపారు. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో జయసూర్య, ఎం ముఖేష్‌లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి మిను మునీర్ ఫిర్యాదు చేయగా, ఈ వేధింపులకు సంబంధించి నటుడు జయసూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొడుపుజాలోని ఓ లొకేషన్‌లో నేను టాయిలెట్ నుండి బయటకు వస్తుండగా, జయసూర్య నన్ను వెనుక నుండి కౌగిలించుకుని, బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, లైంగికంగా వేధించాడని ఆమె తెలిపింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితులకు సంబంధించి ఇటీవల జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన నేపథ్యంలో ఈ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల నటి సోనియా మల్హర్ కూడా తన అనుభవాలను ప్రస్తావించారు. కెరీర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.