అపాయింట్‌మెంట్ ఇవ్వండి! అమిత్‌షాతో భేటీకి శశికళ ప్రయత్నం
సార్వత్రిక ఎన్నికలకు ముంగిట్లో సౌత్ ఇండియా పాలిటిక్స్ ఆసక్తిగా మారుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ముంగిట్లో సౌత్ ఇండియా పాలిటిక్స్ ఆసక్తిగా మారుతున్నాయి. కర్నాటక ఓటమి అనంతరం దక్షిణ భారత దేశంలో పార్టీని బలోపేతం చేయడంపై కమలం పార్టీ కసరత్తు చేస్తున్నది. తమతో నడిచి వచ్చే పార్టీలు, నేతల కోసం పక్కా స్కెచ్ వేస్తున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడులో శశికళ వ్యవహారం ఆసక్తిగా మారింది.
మాజీ సీఎం జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన వీకే శశికళ తిరిగి ఆ పార్టీలోకి ఎంట్రీ ఎచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరులో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన శశికళ.. తాజాగా మరోసారి అమిత్ షా తో భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అన్నాడీఎంకేలో తాను తిరిగి అడుగుపెట్టేందుకు పళనిస్వామి అంగీకరించకపోవడంతోనే మరో ప్రత్యామ్నాయంతో అమిత్ షాతో సమావేశానికి శశికళ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కర్నాటక చేజారిపోవడంతో తమిళనాడుపై ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు అక్కడ అన్నాడీఎంకే ఐక్యంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో పళనిస్వామి, పన్నీరు సెల్వంలను ఏకం చేసే వ్యూహం రచిస్తున్నదని టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే శశికల సైతం అన్నాడీఎంకేతో కలిసిపోవడానకి ప్రయత్నాలు చేస్తుండగా ఇందుకు అమిత్ షా సహకారం కోరిందని టాక్. ఈ నేపథ్యంలోనే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీకి పన్నీరు సెల్వంను అధ్యక్షుడిగా చేయడం ద్వారా తన పొలిటికల్ గ్రాఫ్ పెంచుకునేందుకు శశికళ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నాడీఎంకే నేతలంతా ఏకతాటిపైకి రావాలని బీజేపీ యోచిస్తున్నది. ఒక వేళ పొత్తు కుదరని పక్షంలో ఓపీఎస్, టీటీవీ వర్గాలను కలిపి మెగా కూటమి అయినా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బీజేపీ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శశికళ మరోసారి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరడం చర్చనీయాశంగా మారింది.