Kasturi : నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీజేపీ నాయకురాలు..సీనియర్ నటి కస్తూరి(Kasturi)కి మధురై హైకోర్టు (Madurai High Court)షాక్ ఇచ్చింది.

Update: 2024-11-14 06:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీజేపీ నాయకురాలు..సీనియర్ నటి కస్తూరి(Kasturi)కి మధురై హైకోర్టు (Madurai High Court)షాక్ ఇచ్చింది. ఈ కేసులో కస్తూరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను మధురై హైకోర్టు కోట్టివేసింది. హైకోర్టు మధురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నటి కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. మరోవైపు కస్తూరి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి పరారీలో ఉన్నట్లు తమిళనాడు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

ఇటీవల చెన్నైలో బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసు కురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ తెలుగు వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం అంతఃపురంలో సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడులో చలామణి అవుతున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇక నటి కస్తూరి అరెస్టు తప్పదు అని తెలిశాక ఆమె తమిళనాడు నుంచి వెళ్లిపోయారు. ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కస్తూరిని అరెస్టు చేసేందుకు పోయెస్ గార్డెన్ లోని ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ప్రత్యేక బృందంతో ఆమె కోసం గాలిస్తున్నారు. అప్రమత్తమైన కస్తూరి ముందస్తు బెయిల్ కోసం తన న్యాయవాదుల ద్వారా మధురై కోర్టును ఆశ్రయించినప్పటికి బెయిల్ మంజూరీకి కోర్టు నిరాకరించడంతో ఆమె అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది.

అంతకు ముందు కస్తూరి పిటిషన్ ను విచారణకు సేకరించిన మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ విచారణ సమయంలో కస్తూరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పదిమందిని ఉద్దేశించి చేసే ప్రసంగాల్లో ఆధారాలు లేకుండా ఏది అనిపిస్తే అది ఎలా మాట్లాడుతారని మధురై బెంచ్ కస్తూరి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని.. తెలుగువారు వలస వచ్చిన వారు కాదని రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో తెలుగువారిని తమిళులను వేరుచేసి చూడలేమని కూడా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి అన్నారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాదని పోలీసులను అడిగింది. వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించారా లేదా అని కూడా ప్రశ్నించింది.

Tags:    

Similar News