Macedonia: ఉత్తర మాసిడోనియా నైట్ క్లబ్‌లో మంటలు.. 59 మంది మృతి

యూరోపియన్ దేశమైన ఉత్తర మాసిడోనియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైట్ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2025-03-16 14:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ దేశమైన ఉత్తర మాసిడోనియా(Masidonia)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైట్ క్లబ్‌ (Night club)లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కోకాని (Kokani) పట్టణంలో ఏర్పాటు చేసిన హిప్ హాప్ సంగీత కచేరీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కచేరీ కోసం క్లబ్‌లో 1500 మంది గుమిగూడారని.. ఈ క్రమంలోనే పలువురు యువకులు పటాకులు పేల్చగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మొదట స్వల్పంగా ప్రారంభమైన మంటలు వెను వెంటనే తీవ్రంగా వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీసినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.

ఈ ప్రమాదంపై మాసిడోనియా ప్రధాని హ్రిస్టిజన్ మికోస్కీ (Hristijan mikoskee) స్పందించారు. ‘ఇది మాసిడోనియాకు కష్టమైన, విచారకరమైన రోజు. చాలా మంది యువకుల మరణం బాధాకరం. వారి కుటుంబాలు, ప్రియమైనవారు స్నేహితుల బాధ అపరిమితమైనది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధితుల బాధలను తగ్గించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. గాయపడిన వారిని రాజధాని స్కోప్జేతో సహా దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన తర్వాత క్లబ్‌లో గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News