Amit shah: బోడో శాంతి ఒప్పందాన్ని కాంగ్రెస్ అవహేళన చేసింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బోడో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసిందని అమిత్ షా ఆరోపించారు.

Update: 2025-03-16 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బోడో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసిందని, కానీ ఆ అగ్రిమెంటే ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేసిందని తెలిపారు. కోక్రాఝర్ (KograGhar) జిల్లాలోని దోత్మాలో ఆదివారం జరిగిన ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ABSU) 57వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘2020 జనవరి 27న బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ( BTR) శాంతి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, బోడోలాండ్‌లో ఎప్పటికీ శాంతి ఉండబోదని, ఈ అగ్రిమెంట్ ఒక జోక్‌గా మిగిలిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసేది. కానీ అసోం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందంలోని నిబంధనల్లో దాదాపు 82 శాతం అమలు చేశాయి’ అని వ్యాఖ్యానించారు.

మిగిలిన నిబంధనలను రెండేళ్లలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా బోడోలాండ్‌లో శాశ్వత శాంతి నెలకొంటుందని నొక్కి చెప్పారు. బోడోలాండ్‌లో శాంతి నెలకొల్పడం, అభివృద్ధిలో ఏబీఎస్‌యూ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఏబీఎస్‌యూ లేకపోతే బోడో ఒప్పందం, బోడోలాండ్‌లో శాంతి ఉండేది కాదని స్పష్టం చేశారు. ఐదు జిల్లాలతో కూడిన, స్వయంప్రతిపత్తి కలిగిన బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ద్వారా పాలించబడే బీటీఆర్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని తెలిపారు. వేలాది మంది యువకులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈశాన్య ప్రాంతాన్ని ఉగ్రవాదం, ఆందోళనలు, బంద్‌లు, దిగ్బంధనాలు, హింస నుండి విముక్తి చేశామని తెలిపారు.

Tags:    

Similar News