Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 32 మంది మృతి
మధ్య, దక్షిణ అమెరికాలో సంభవించిన తుపానులు, టోర్నడోల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో టోర్నడో(Tornadoes)లు విరుచుకుపడ్డాయి. మధ్య, దక్షిణ అమెరికాలో సంభవించిన తుపానులు, టోర్నడోల కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరిన్ని టోర్నడోలు సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది. టోర్నడోల ధాటికి కాన్సాస్ (Kansas) లో 50 కి పైగా వాహనాలు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. తీవ్రమైన దుమ్ము తుపాను సమయంలో దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. అంతేగాక మిస్సిస్సిప్పిలో ఆరుగురు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు.
టెక్సాస్ (Texas) లోని అమరిల్లోలో దుమ్ము తుపాన్ కారణంగా కారు ప్రమాదానికి గురి కావడంతో ముగ్గురు మరణించారు. వేగంగా కదిలే ఈ టోర్నడోలు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని యూఎస్ తుఫాను అంచనా కేంద్రం పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో వడగళ్ళు, టోర్నడోలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు లూసియానా, మిస్సిస్సిప్పి, అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడాలకు టోర్నడోల హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నేషనల్ వెదర్ సర్వీస్ మిన్నెసోటాలోని పశ్చిమ, తూర్పు దక్షిణ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 6 అంగుళాల వరకు మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.