కశ్మీర్‌లో ‘ఇండియా’ సీట్ల పంపకాలు ఖరారు
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీట్ షేరింగ్ కమిటీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఈవివరాలను వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిందని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు చెరో 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాయని వెల్లడించారు. ఉధంపూర్, జమ్మూ, లడఖ్ స్థానాల్లో కాంగ్రెస్.. అనంత్‌నాగ్, శ్రీనగర్, బారాముల్లా స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు పోటీ చేస్తారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ఇండియా కూటమి ముఖ్య లక్ష్యమన్నారు. పీడీపీ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగమేనా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖుర్షీద్ బదులిచ్చారు. ‘‘పీడీపీ ఇండియా కూటమిలో భాగమే. కూటమిలో సీట్ల సర్దుబాటు వేరే అంశం. మొత్తం పొత్తు వేరే అంశం. జమ్మూ కాశ్మీర్ విస్తీర్ణంలో చిన్నది కాబట్టి అక్కడ రెండుకు మించి పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకోవడం కుదరదు’’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, మహబూబా ముఫ్తీ రాజకీయ పార్టీ పీడీపీ ఇప్పటికే కశ్మీర్‌లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అనంతనాగ్ లోక్‌సభ స్థానంలో గులాం నబీ ఆజాద్‌పై మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.