జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్

వివిధ హైకోర్టులు సిఫార్సు చేసిన జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు మంగళవారం కఠిన వైఖరి తీసుకుంది.

Update: 2023-09-26 14:27 GMT

న్యూఢిల్లీ: వివిధ హైకోర్టులు సిఫార్సు చేసిన జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్టు మంగళవారం కఠిన వైఖరి తీసుకుంది. ఇది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య మరో వివాదంగా మారే అవకాశం ఉన్నందున.. హైకోర్టు సూచనలను కొలీజియంకు కేంద్రం ఇంకా ఎందుకు పంపలేదని సుప్రీం ప్రశ్నించింది. జడ్జిల పేర్లను క్లియర్ చేయడంలో జాప్యంపై ఫిర్యాదులు విన్న అనంతరం న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ‘గత 10 నెలలుగా 80 హైకోర్టు పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే. కానీ కొలీజియం నిర్ణయం తీసుకోవాలంటే.. మీ అభిప్రాయం తప్పక వినాలి’ అని జస్టిస్ కౌల్ కేంద్రానికి సూచించారు.

‘సెన్సిటివ్ హైకోర్ట్’కి చీఫ్ జస్టిస్‌ను నామినేట్ చేయడంతో పాటు 26 మంది న్యాయమూర్తుల బదిలీలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని బెంచ్ ప్రకటించింది. హైకోర్టు సిఫార్సు చేసినా.. కొలీజియంకు అందకుండా ఎన్ని పేర్లు పెండింగ్‌లో ఉన్నాయో తన వద్ద సమాచారం ఉందని జస్టిస్ కౌల్ అన్నారు. దీనిపై స్పందించేందుకు అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి వారం గడువు కోరగా.. బెంచ్ రెండు వారాల సమయం ఇచ్చింది. మొత్తానికి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ కౌల్.. ‘చెప్పాల్సింది చాలా ఉన్నప్పటికీ ఆగిపోతున్నాను. A-G ప్రతిస్పందించడానికి ఒక వారం గడువు కోరినందున మౌనం వహిస్తున్నాను. కానీ తదుపరి విచారణ తేదీలో (అక్టోబర్ 5) మాత్రం నిశ్శబ్దంగా ఉండను’ అన్నారు.


Similar News