గత ప్రభుత్వాలు రాముడిని టెంట్ కింద ఉంచాయి : యోగి ఆదిత్యనాథ్

Update: 2023-06-16 16:58 GMT

సోనభద్ర (ఉత్తరప్రదేశ్): గత ప్రభుత్వాలు టెంట్ కింద ఉంచిన శ్రీరాముడు.. వచ్చే ఏడాది అయోధ్యలోని తన మహా మందిరంలో కొలువు తీరుతారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై కోర్టుల్లో వాదోపవాదనలు నడిచినన్ని నాళ్ళు అయోధ్యలో రాముడి విగ్రహాన్ని తాత్కాలిక టెంట్ల కిందే ఉంచారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలన్నీ రామరాజ్యానికి పునాది రాయిలా నిలుస్తాయని చెప్పారు. సోన్‌భద్ర జిల్లాలో రూ.414 కోట్లు విలువైన 217 అభివృద్ధి కార్యక్రమాలకు యోగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

రామాయణ కాలంలో రాముడిని గౌరవించిన ఘన చరిత్ర సోన్‌భద్ర ప్రాంత ప్రజలకు ఉందన్నారు. పుష్కలంగా సహజ వనరులను కలిగి ఉన్న రుషుల భూమి సోన్‌భద్రను పర్యాటక కేంద్రంగా మారుస్తామని యోగి ప్రకటించారు. కేంద్రం సహకారంతో సోన్‌భద్ర లో కృషి విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. సోనభద్రకు మంజూరు అయిన మెడికల్ కాలేజీలో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.


Similar News