పదేళ్లలో భాగస్వామం మరింత బలోపేతమైంది- రష్యా పర్యటనకు ముందు మోడీ వ్యాఖ్యలు

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ తొలిసారిగా విదేశీ పర్యటనకు బయల్దేరారు. 22వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

Update: 2024-07-08 07:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ తొలిసారిగా విదేశీ పర్యటనకు బయల్దేరారు. 22వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోడీ మాస్కో వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యా, ఆస్ట్రియాలో ఆయన ప్రయాణించనున్నారు. విదేశీ పర్యటనకు ముందు మోడీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు."నా స్నేహితుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారం సహా అన్ని అంశాలు సమీక్షించడానికి ఎదురుచూస్తున్నా. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాణలు పంచుకోబోతున్నాం” అని అన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గత పదేళ్లలో భారత్- రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందిందన్నారు. అన్ని రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం బలోపేతమైందన్నారు. రష్యాలోని ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నా అన్నారు.

భారత్ కు విశ్వసనీయ భాగస్వామి ఆస్ట్రియా

రష్యాలో చర్చలు జరిగిన తర్వాత ప్రధాని మోడీ ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో భారతదేశ ప్రధాని పర్యటించనున్నారు. భారత్ కు ఆస్ట్రియా ధృడమైన, విశ్వసనీయ భాగస్వామి అని మోడీ అభివర్ణించారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెల్లెన్, ఛాన్సిలర్ క్లార్ నెహమ్మర్ ను కలిసే అవకాశం లభిస్తుందన్నారు. గత 40 ఏళ్లలో ఆస్ట్రియాలో భారత ప్రధాని తొలి పర్యటన అని అన్నారు. ఆవిష్కరణ, సాంకేతికత సహా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు చర్చల కోసం ఎదురుచూస్తున్నా అని ఎక్స్ లో పేర్కొన్నారు.


Similar News