India: డెస్పాంగ్, డెంచాక్ నుంచి సైనిక దళాల ఉపసంహరణ 90 శాతం పూర్తి

దిశ, నేషనల్ బ్యూరో : తూర్పు లడఖ్‌ పరిధిలోని డెస్పాంగ్(Depsang), డెంచాక్ ప్రాంతాల నుంచి భారత్(India), చైనా(China) సైనిక దళాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు 80 నుంచి 90 శాతం మేర పూర్తయింది.

Update: 2024-10-28 15:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తూర్పు లడఖ్‌ పరిధిలోని డెస్పాంగ్(Depsang), డెంచాక్ ప్రాంతాల నుంచి భారత్(India), చైనా(China) సైనిక దళాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు 80 నుంచి 90 శాతం మేర పూర్తయింది. ఇందులో భాగంగా ఆయా ఏరియాలలోని అన్ని రకాల మౌలిక సదుపాయాలను కూడా ఇరుదేశాలు తొలగించాయి. ఈవిషయాన్ని భారత రక్షణ శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి. డెస్పాంగ్, డెంచాక్ నుంచి పూర్తిస్థాయిలో సైనిక దళాల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం (అక్టోబరు 29)కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2020 ఏప్రిల్‌కు మునుపటి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే భారత్, చైనా సైన్యాలు గస్తీని నిర్వహిస్తాయి.

చైనా, భారత్‌ మధ్య పరస్పర విశ్వాస భావన కీలకం : రష్యా రాయబారి

చిత్తశుద్ధి, పరస్పర విశ్వాస భావనతో చైనా, భారత్‌ మధ్య సరిహద్దు వివాదం సమసిపోతుందని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. సరిహద్దు వివాదం మొదలైన ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజన్‌ వేదికగా చైనా, భారత్‌‌లు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరపడాన్ని శుభ పరిణామంగా ఆయన అభివర్ణించారు. రష్యా, చైనా మధ్య కూడా సరిహద్దు వివాదం దాదాపు 40 ఏళ్ల పాటు కొనసాగిందని అలిపోవ్ గుర్తుచేశారు. ‘‘సరిహద్దు వివాదాలు ఎంతో క్లిష్టమైనవి. అయినా వాటిని త్వరితగతిన పరిష్కరించుకునేందుకు చైనా, భారత్ చొరవ చూపుతుండటం సానుకూల అంశం’’ అని ఆయన పేర్కొన్నారు. ఆసియా ప్రాంతంలో ఈ రెండు దేశాలు ప్రధాన ఆర్థిక శక్తులని అలిపోవ్ చెప్పారు.

Tags:    

Similar News