రేపే విడుదల : బీజేపీ ‘సంకల్ప పత్రం’లో ఏమేం ఉంటాయో తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్‌సభ పోల్స్‌లో 370 సీట్ల భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ.. ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది.

Update: 2024-04-13 13:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్‌సభ పోల్స్‌లో 370 సీట్ల భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ.. ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ‘భారత్ సంకల్ప పత్రం’ పేరుతో మేనిఫెస్టోను కమలదళం విడుదల చేయనుంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. దీన్ని విడుదల చేసిన తర్వాత బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమంటూ ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి భరోసా ఇచ్చే జనాకర్షక హామీలను బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చారని అంటున్నారు. ‘సబ్ కా సాథ్.. సబ్‌ కా వికాస్.. సబ్‌ కా విశ్వాస్.. సబ్‌ కా ప్రయాస్’ అనే మంత్రంతో సంకల్ప్ పత్ర ఉంటుందని చెబుతున్నారు. సాధించగలిగిన హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం అనేది తమ మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశమని బీజేపీ చెప్పనుంది. ‘‘మోడీ కీ గ్యారంటీ, వికసిత భారత్‌’’ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించారని బీజేపీ వర్గాలు చెప్పాయి. కల్చరల్ నేషనలిజంపై దృష్టిసారిస్తూనే.. 2047 సంవత్సరం నాటికి అభివృద్ధిచెందిన భారతదేశాన్ని సాధిస్తామనేది మోడీ గ్యారంటీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

15 లక్షల సూచనల్లో..

బీజేపీ సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు వచ్చాయి. వీటిలో 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో వచ్చాయి. 4 లక్షల మందికిపైగా ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్‌ ద్వారా సబ్మిట్ చేశారు. 27 మంది కీలక నేతలతో కూడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కో-ఆర్డినేటర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో-కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రజల అభిప్రాయం, సలహాల ఆధారంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాలకు చెందిన కీలక హామీలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News